లాభాలను ఎగ్జిట్‌ చేసిన పోల్స్‌ | Sakshi
Sakshi News home page

లాభాలను ఎగ్జిట్‌ చేసిన పోల్స్‌

Published Tue, Dec 11 2018 1:07 AM

Sensex cracks 714 pts, Nifty below 10,500: Exit poll, growth worries weigh  - Sakshi

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ఎగ్జిట్‌ పోల్స్‌ రావడంతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా నష్టపోయింది. దీనికి రూపాయి పతనం, ముడి చమురు ధరలు పెరగడం, బలహీన అంతర్జాతీయ సంకేతాలు కూడా తోడవడంతో స్టాక్‌ సూచీలు భారీగా క్షీణించాయి. ప్రపంచ మార్కెట్ల పతనం నేపథ్యంలో సెన్సెక్స్‌ 35,000 పాయింట్ల దిగువకు పతనం కాగా, నిఫ్టీ 10,500 పాయింట్ల కిందకు పడిపోయింది. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. రియల్టీ, బ్యాంకింగ్, లోహ, ఫార్మా, ఆర్థిక రంగ షేర్లు నష్టపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 714 పాయింట్లు నష్టపోయి 34,960 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 205 పాయింట్లు పతనమై 10,488 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 2 శాతం, నిఫ్టీ 1.92 శాతం చొప్పున కుదేలయ్యాయి. సెన్సెక్స్‌ ఒక్క రోజులో ఇన్ని పాయింట్లు క్షీణించడం గత ఏడాది అక్టోబర్‌ 11 తర్వాత ఇదే మొదటిసారి.
 
భారీ నష్టాలతో ఆరంభం...

స్టాక్‌ సూచీలు భారీ నష్టాలతో ఆరంభమయ్యాయి. సెన్సెక్స్‌ 468 పాయింట్లు, నిఫ్టీ 185 పాయింట్ల భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 757 పాయింట్లు, నిఫ్టీ 219 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. మధ్య ప్రదేశ్, చత్తీస్‌ఘర్‌ రాష్ట్రాల్లో పదిహేనేళ్లపాటు బీజేపీ అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బలంగా ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఎనలిస్ట్‌ వి.కె. శర్మ చెప్పారు. దీంతో ఆ రాష్ట్రాల్లో బీజేపీకి ఓట్లు తగ్గనున్నాయని  పేర్కొన్నారు. ఇది వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ విజయవకాశాలపై ప్రభావం చూపనున్నదని వ్యాఖ్యానించారు. మార్కెట్‌ సెంటిమెంట్‌పై పలు అంశాలు ప్రభావం చూపాయని ఎమ్‌కే వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఎనలిస్ట్‌  జోసెఫ్‌ థామస్‌ పేర్కొన్నారు. మార్కెట్‌పై బేర్లు పూర్తిగా పట్టు బిగించారని, వ్యాఖ్యానించారు. 

మరిన్ని విశేషాలు...
ప్రమోటర్ల వాటాను తగ్గిస్తూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాన్ని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ బాంబే హైకోర్ట్‌లో సవాల్‌ చేసింది. దీంతో బీఎస్‌ఈలో ఈ షేర్‌ 6.5% నష్టంతో రూ. 1,198 వద్ద ముగిసింది.   31 సెన్సెక్స్‌ షేర్లలో రెండు షేర్లు–కోల్‌ ఇండియా, మారుతీ సుజుకీ మాత్రమే లాభపడ్డాయి.  షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదన పరిశీలనలో ఉన్న కారణంగా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొ షేర్‌ 3.3 4 శాతం లాభపడి రూ.134 వద్ద ముగిసింది. 

రూ.2.50 లక్షల కోట్ల సంపద ఆవిరి...
స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాల కారణంగా రూ.2.50 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.2.50 లక్షల కోట్లు తగ్గి రూ.138 లక్షల కోట్లకు పడిపోయింది.

నేడు మార్కెట్లో భారీ పతనమేనా ?
ఉర్జిత్‌  రాజీనామా,   రూపాయి ఆఫ్‌షోర్‌ మార్కెట్లో రూపాయి ఒకటిన్నర శాతం క్షీణత∙వెరసి..  భారత కాలమానం రాత్రి గం.10.30 ని.  మన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీని ప్రతిబింబించే సింగపూర్‌ ఎక్సే్చంజ్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 200 పాయింట్లకు(2 శాతం) పైగా పతనమై 10,300 పాయింట్ల రేంజ్‌లో ట్రేడవుతోంది. మరోవైపు అంతర్జాతీయ వృద్ధిపై ఆందోళనలు, ఇతరత్రా అంశాల కారణంగా అమెరికా మార్కెట్‌ తీవ్రమైన నష్టాల్లో ట్రేడ్‌అవుతోంది. డోజోన్స్‌ సూచీ 500పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్ల వరకూ పతనమయ్యాయి. మరోవైపు అమెరికా స్టాక్‌ మార్కెట్లో మన ఆరు ఏడీఆర్‌(అమెరికన్‌ డిపాజిటరీ రిసీట్స్‌)లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఈ వార్త రాసే 10 గంటల సమయానికి ఇన్ఫోసిస్, విప్రో, టాటా మోటార్స్, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌లు 2–6 శాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దీంతో ఈ షేర్లకు నేడు మన మార్కెట్లో భారీ నష్టాలు తప్పవనే అంచనాలు నెలకొన్నాయి.   ఈ ప్రతికూల అంశాలకు తోడు నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజీపీకి ఎదురుగాలి తప్పదంటూ గత శుక్రవారం ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడి కావడం, ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ కారణంగా సోమవారం సెన్సెక్స్‌ 714 పాయింట్లు పతనం కావడం తెలిసిందే. గత శుక్రవారం వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమైతే, మార్కెట్లో పతనం కొనసాగుతుందని నిపుణులు        అంచనా వేస్తున్నారు.  నిఘా మరింత పటిష్టం: కీలక పరిణామాల నేపథ్యంలో మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ, స్టాక్‌ ఎక్సే్చంజ్‌లు నిఘా వ్యవస్థను పటిష్టం చేశాయి.  కీలకమైన సూచీలు, షేర్లకు వర్తించే సర్క్యూట్‌ లిమిట్‌లను సిద్ధం చేశామని సంబంధిత అధికారులు వెల్లడించారు.   

Advertisement
Advertisement